Gautam Adani : గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు.. లంచం ఇచ్చారని ఆరోపణ.. ఎన్ని వేల కోట్లంటే ?
Gautam Adani : భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీ, ఇతర అధికారులు సోలార్ ఎనర్జీకి సంబంధించిన ఒప్పందాల కోసం భారత ప్రభుత్వ అధికారులకు 250 మిలియన్ డాలర్లు మన కరెన్సీలో దాదాపు రూ. 2110 కోట్లు లంచం ఇచ్చారని అమెరికా ప్రాసిక్యూటర్ ఆరోపించారు. ఆరోపణల ప్రకారం 2020 – 2024 మధ్యకాలంలో అదానీ గ్రూప్‌కు రెండు బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టే భారీ సౌర విద్యుత్ కాంట్రాక్టులను పొందేందుకు లంచాలు ఇచ్చారని ఆరోపిస్తున్నారు.
ఈ కేసులో కెనడియన్ పెన్షన్ ఫండ్ CDPQ ముగ్గురు మాజీ ఉద్యోగులు కూడా లంచం విచారణను అడ్డుకున్నారని ఆరోపించారు. CDPQ అదానీ గ్రూప్ కంపెనీలలో వాటాదారు. ఈ విషయం అదానీ గ్రూప్‌కు మరో పెద్ద సవాలుగా మారవచ్చు. అంతకుముందు జనవరి 2023లో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ గ్రూప్ స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసానికి పాల్పడిందని ఆరోపించింది. దీని కారణంగా అదానీ గ్రూప్ మార్కెట్ విలువలో 150 బిలియన్ డాలర్లు నష్టం జరిగింది. అయితే, గ్రూప్ అన్ని ఆరోపణలను ఖండించింది.. ప్రస్తుతం చాలా నష్టాలను భర్తీ చేసింది.