Air quality : హైదరాబాద్ లో పడిపోయిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్.. పట్టించుకోని అధికారులు
Air quality : దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకొంది. ప్రస్తుతం ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో సగటు గాలి నాణ్యతా సూచీ 500 మార్కులు దాటేసింది. దీంతో అక్కడి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అయితే దక్షిణాదిన ఢిల్లీ మాదిరే మరో కాలుష్య నగరం హైదరాబాద్ తయారయింది. హైదరాబాద్ నగరాన్ని కాలుష్య భూతం కబళిస్తోంది. గత వారం రోజులుగా ఈ నగరం వాతావరణంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ లో ఆదివారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దారుణంగా పడిపోయింది. చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యతా సూచీ 300 మార్కు దాటేసింది.
కూకట్ పల్లి, మూసాపేట్, బాలానగర్, నాంపల్లి, మెహదీపట్నం తదితర ప్రాంతాల్లో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. పరిస్థితి చేజారకముందే చర్యలు చేపట్టాలని పర్యావరణ వేత్తలు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఒక్కసారిగా కాలుష్యం పెరగడానికి వాహనాలు ఒక కారణమైతే, ఎక్కడో ఊరి బయట ఉండే ఫ్యాక్టరీలు ఇప్పుడు నగరం మధ్యలో తిష్టవేశాయి. దీంతో వాయుకాలుష్యం భారీగా పెరిగిపోతోంది. ఇదిలాగే కొనసాగితే జంట నగరాల వాసులు శ్వాసకోశ వ్యాధుల భారిన పడే ప్రమాదం ఉంది. ఈ సమస్యపై కనీసం దృష్టి పెట్టని జీహెచ్ఎంసీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. ట్రాఫిక్ నియంత్రణ లేకపోవడంతో వాయు, శబ్ద కాలుష్యం మరింత పెరుగుతోంది. ఇదిలాగే కొనసాగితే హైదరాబాద్ కూడా మరో ఢిల్లీ అవుతుందని నగరవాసులు భయకంపితులవుతున్నారు.