JAISW News Telugu

YCP Leaders : వైసీపీలో ముసలం.. రగులుతున్న అసంతృప్తులు..ఒక్కొక్కరుగా బయటకు..

YCP Leaders

YCP Leaders out from the Party, YCP Flag

AP YCP Leaders out From the Party : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లు గెలవాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న జగన్ కు నేతలు షాక్ లు ఇస్తున్నారు. మొన్నటిదాక ఒకరిద్దరిలోనే అసంతృప్తి ఉందని, అందరూ పార్టీ నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తున్నారని వైసీపీ పెద్దలు చెప్పుకుంటూ వచ్చారు. మార్పులు, చేర్పులతో సిట్టింగుల్లో ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా బయటపడుకుంటూ వస్తోంది. మొన్నటిదాక పెద్దగా బయటపడని నేతలు ఒక్కొక్కరుగా తమ అసంతృప్తిని వెళ్లగక్కడమే కాదు ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు దారులు చూసుకుంటున్నారు. వైసీపీ అధినేత ఎంపీలను ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలను ఎంపీలుగా పోటీ చేయించడమే కాదు పలువురికి సీటునే నిరాకరిస్తున్నారు. ఇప్పుడిదే ఆ పార్టీపై పెనుప్రభావం చూపే అవకాశాలు కనపడుతున్నాయి.

తాజాగా క్రికెటర్ అంబటి రాయుడు ఆ పార్టీకి భారీ షాక్ ఇచ్చారు. ఏపీ నుంచి క్రికెటర్ గా మంచి పేరు సంపాదించుకున్న ఈయన వైసీపీలో చేరే ముందు నుంచి చేరేదాక హల్ చల్ చేశారు. పార్టీలో చేరి జగన్ ను ప్రశంసలతో ముంచెత్తారు. గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేద్దామని భావించారు. ఇంతలోనే సడన్ గా  వైసీపీ నుంచి బయటకు వస్తున్నట్లు వెల్లడించారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నానని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తానని రాయుడు ట్వీట్ చేశారు. అయితే ఆయనకు గుంటూరు ఎంపీ స్థానంపై అధిష్ఠానం నుంచి హామీ రానట్టు సమాచారం. ప్రస్తుతానికైతే పార్టీ కోసం పనిచేయండి.. తర్వాత చూద్దాం.. అని చెప్పి ఉంటారని తెలుస్తోంది. గుంటూరు సీటుపై నమ్మకం పెట్టుకున్న రాయుడు మనస్తాపంతోనే సడెన్ గా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ తరుణంలోనే నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి నరసరావుపేట నుంచి పోటీ చేయట్లేదని చెప్పారు. గుంటూరు నుంచి పోటీ చేయాలని అధిష్ఠానం ఆదేశించినట్టు చెప్పారు. అయితే తనకు గుంటూరు నుంచి పోటీ చేసే ఆలోచన లేదని ఆయన అంటున్నారు.  అధిష్ఠానం  లెక్కలు వేరు.. తన ఆలోచనలు వేరని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. కాగా, ఇక్కడి నుంచి పోటీ చేయడానికి మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈమేరకు ఆయనను తాడేపల్లి సీఎంవోకు వచ్చి కలువాలని ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.

ఇక ఎంపీ పదవుల గోల ఇలా ఉంటే.. ఎంపీ గొడ్డేటి మాధవిని అరకు నియోజకవర్గ ఇన్ చార్జిగా అధిష్ఠానం నియమించింది. అయితే ఆమె నియామకాన్ని  స్థానిక వైసీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘‘లోకల్ ముద్దు.. నాన్ లోకల్ వద్దు..’’ అంటూ నిరసన ర్యాలీలు చేస్తున్నారు. అరకులో ఎంతో మంది సీనియర్ నాయకులు, ఆశావహుల ఉండగా పాడేరుకు చెందిన గోడ్డేటి మాధవిని అరకు ఇన్చార్జిగా ఎలా నియమిస్తారని మండిపడుతున్నారు. స్థానికులనే ఇన్చార్జిగా నియమించి, సీటు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. నాన్ లోకల్ క్యాండిడేట్ మాధవిని మార్చకపోతే కచ్చితంగా ఓడిస్తామని స్థానిక వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను వైసీపీ అధిష్ఠానం మార్చింది. వారిలో పెండెం దొరబాబు, పర్వత ప్రసాద్, జ్యోతుల చంటిబాబు, కొండేటి చిట్టిబాబు ఉన్నారు. వీరిలో పెండెం దొరబాబు మాత్రమే అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మిగతా ముగ్గురు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతానికి  అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

మచిలీపట్నం లోక్‌సభ ఎంపీ బాలశౌరి కూడా టీడీపీలోకి జంప్ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో మంచి పట్టు ఉన్న సీనియర్ నాయకుడు ఈయన. అంతకుముందు 2004లో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తెనాలి ఎంపీగా పనిచేశారు. ఈయన పార్టీ మారితే నియోజకవర్గంలో పార్టీకి గడ్డుకాలమేనని విశ్లేషకులు అంటున్నారు.

ఇక మార్పులు, చేర్పులు వ్యవహారం వీరే కాక మరెంతో మంది అసంతృప్తితో రగిలిపోతున్నట్టు సమాచారం. అమరావతి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌ ఇప్పటికే అధికార పార్టీని వీడారు.  ఆర్కే వైఎస్ షర్మిల నడవాలని నిర్ణయించుకోగా వంశీకృష్ణ యాదవ్ జనసేనలో చేరారు.

పార్టీలో ఇంతగా వ్యతిరేకత ఉన్నప్పటికీ అధిష్ఠానం మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తోంది. ఎవరూ వెళ్లిన తమదే గెలుపు అన్నట్టుగా వ్యవహరిస్తోంది. పార్టీ నేతలను తాము చెప్పిందే వినాలని.. తాము పోటీ చేయాలంటేనే చేయాలని.. నియంత పోకడలతో కట్టడి చేయాలని చూస్తే బానిసలాగా ఎవరూ వినే పరిస్థితి లేదని ప్రస్తుత ఘటనలను బట్టి అర్థమవుతోంది. పార్టీలో అసంతృప్తి రగులుకుంటే ఇక ఆపేది ఉండదని తెలుస్తోంది. తద్వారా ఎన్నికల్లో ఆ పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి.

Exit mobile version