Devil:నందమూరి కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ `డెవిల్`. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి నవీన్ మేడారం దర్శకుడు. అభిషేక్ నామా అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మించారు. బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ నేపథ్యంలో సాగే కల్పిత కథగా ఈ సినిమాను రూపొందించారు. డిసెంబర్ 29న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతోంది.
ఈ సందర్భంగా దర్శకుడు నవీన్ మేడారం రిలీజ్ చేసిన ఓపెన్ లెటర్ ఆసక్తికరంగా మారింది. గతంలో ఈ సినిమా నిర్మాతకు, దర్శకుడికి మధ్య నెలకొన్న వివాదం కారణంగా ఆయనని ఈ సినిమా నుంచి తప్పించారు. దర్శకుడిగా సినిమా మొత్తం పూర్తి చేసినా ఆ క్రెడిట్ అతనికి ఇవ్వకుండా నిర్మాత అభిషేక్ నామా తన పేరునే వేసుకోవడం ఇటీవల చర్చనీయాంశం అయింది. సినిమా మరో రెండు రోజుల్లో రిలీజ్ కానున్న నేపథ్యంలో దర్శకుడు నీవన్ మేడారం సోషల్ మీడియా వేదికగా ఓపెన్ లెటర్‌ని విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది.
సినిమా మొత్తం తానే పూర్తి చేసినప్పటికీ తనకు క్రెడిట్ ఇవ్వడం లేదని వాపోయాడు. `డెవిల్` సినిమాకు ప్రాణం పోసేందుకు మూడేళ్ల పాటు శ్రమించాను. స్క్రిప్ట్, స్క్రీన్‌ప్లే రాయడం, కాస్ట్యూమ్స్, సెట్స్, లొకేషన్స్ ఎంపిక..ఇలా సినిమాలోని ప్రతి అంశాన్ని నా ఆలోచనలకు తగ్గట్టుగా తీర్చిదిద్దా. హైదరాబాద్, వైజాగ్, కారైకడి వంటి ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. చిన్నచిన్న సన్నివేశాలు మినహా దాదాపు 105 రోజులు కష్టపడి నేను అనుకున్న విధంగా `డెవిల్`ను తెరకెక్కించా. నా వరకు ఇది కేవలం ప్రాజెక్ట్ మాత్రమే కాదు. నా బేబీ లాంటిది. ఎవరు ఎన్ని చెప్పినా సరే ఇది పూర్తిగా నా చిత్రమే.
ఇప్పటి వరకు ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను మౌనంగానే ఉన్నాను. అయితే నా మౌనాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈ చిత్రాన్ని తెరకెక్కించడంలో నేను ఎలాంటి తప్పు చేయలేదనే క్లారిటీ ఇచ్చేందుకే ఈ పోస్ట్ పెడుతున్నా. అహంకారం, దురాశతో తీసుకున్న కొన్ని నిర్ణయాల ఫలితంగానే నేడు ఇలాంటి వివాదం మొదలైంది. ఇటీవల ప్రచురితమైన కథనాల్లో చెప్పినట్టు..సినిమా, లేదా సినిమాకు సంబంధించి ఏ వ్యక్తిపైనా నేను చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదు. దర్శకుడిగా నాకు క్రెడిట్ ఇవ్వనందుకే బాధపడుతున్నా. నా నైపుణ్యంపై నాకు నమ్మకం ఉంది. శ్రద్ద, నిబద్ధతతో కెరీర్‌లో ముందుకు వెళ్లాలనుకుంటున్నా.. అంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు దర్శకుడు నవీన్ మేడారం.