MGM : మళ్లీ కరోనా కల్లోలం వేళ.. ఎంజీఎం ఆస్పత్రి ఎలా ఉంది?
- ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ

MGM
ఉత్తర తెలంగాణకు వైద్యరంగంలో తల్లి లాంటి ఆసుపత్రిగా పేరొందిన ఎంజీఎం (మహాత్మా గాంధీ మెమోరియల్) ఆసుపత్రి, మళ్లీ కరోనా కల్లోలం నేపథ్యంలో అప్రమత్తమైంది. ఈ పరిస్థితిలో ఆసుపత్రి సన్నద్ధతను పరిశీలించడానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఆయనతో పాటు శాసన మండలి సభ్యులు బస్వరాజు సారయ్య, KUDA చైర్మన్ ఇనగల వెంకట్రామ్ రెడ్డి పాల్గొన్నారు.
– పరిశీలనలు, అసహనం, ఆదేశాలు:
తనిఖీలో భాగంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మొదటగా ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డుల్లో పర్యటించారు. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అత్యవసర సేవ విభాగంలో ఉన్న ఎక్స్-రే, ల్యాబ్, ఆక్సిజన్ స్టోర్, సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటి కీలక విభాగాలను పరిశీలించారు. రోగులకు అందిస్తున్న భోజనం నాణ్యతను తనిఖీ చేయడంతో పాటు భోజనశాలను (డైట్) కూడా పరిశీలించారు. పురుషుల, మహిళల వార్డులను, ఫార్మసీ స్టోర్, చిన్నపిల్లల అత్యవసర విభాగ కేంద్రాన్ని కూడా సందర్శించారు.
ఈ తనిఖీలలో కొన్ని వార్డులలో అపరిశుభ్రత, వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడం, రిజిస్టర్లను సరిగా నిర్వహించకపోవడం పట్ల ఎమ్మెల్యే నాయిని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయా వార్డుల ఇంచార్జ్ లపై అసహనం వ్యక్తం చేస్తూ, పేద, మధ్యతరగతి ప్రజలకు గుండె లాంటి ఈ ఆసుపత్రిని బాధ్యతాయుతంగా నిర్వహించకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ప్రతి ఒక్క సిబ్బంది, వైద్యులు, అధికారులు నైతిక బాధ్యతగా వ్యవహరించి ఆసుపత్రి పట్ల ప్రజలకు విశ్వాసం కల్పించాలని ఆయన స్పష్టం చేశారు.
ప్రజలకు సేవ విషయంలో, ఆసుపత్రి నిర్వహణ పట్ల అభద్రతా భావం కలిగిన వారిని వెంటనే విధులనుంచి తప్పించాలని, పని చేయలేని పక్షంలో స్వచ్ఛందంగా బదిలీలపై వెళ్లొచ్చు అని ఆయన ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఆసుపత్రి అభివృద్ధి, పరిశుభ్రత మనందరి బాధ్యత, కర్తవ్యం అని ఆయన గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్, RMO, ఇతర వైద్యులు పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో ఎంజీఎం ఆసుపత్రి సన్నద్ధతను మెరుగుపరచడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు సంబంధిత అధికారులను ఆదేశించారు.
–వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రి చరిత్ర ఇదీ
ఎంజీఎం ఆస్పత్రి (Mahatma Gandhi Memorial Hospital – MGM Hospital), వరంగల్‌లోని ఒక ప్రముఖ ప్రభుత్వ వైద్య ఆస్పత్రిగా గుర్తించబడింది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఒక ప్రధాన ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా ఉంది, మరియు ఖమ్మం, కరీంనగర్, హనుమకొండ జిల్లాల ప్రజలకు కూడా వైద్య సేవలు అందిస్తుంది.
చరిత్ర:
ఎంజీఎం ఆస్పత్రి 1950లలో స్థాపించబడింది. ఇది నిజాంసాగర్ కాలానికి చెందిన ఒక పురాతన భవనాన్ని ఆధారంగా తీసుకుని అభివృద్ధి చేయబడింది. మహాత్మా గాంధీ గారి జ్ఞాపకార్థంగా ఈ ఆస్పత్రికి “మహాత్మా గాంధీ మెమోరియల్ ఆస్పత్రి” అనే పేరు పెట్టబడింది.
ఇది కాకతీయ వైద్య కళాశాలకి (Kakatiya Medical College – KMC) అనుబంధంగా ఉంది. ఈ కళాశాల విద్యార్థుల ప్రాక్టికల్ శిక్షణ కేంద్రంగా MGM ఆస్పత్రి పనిచేస్తుంది. ప్రారంభంలో చిన్నదైన ఈ ఆస్పత్రి ప్రస్తుతం అనేక విభాగాలు, ప్రత్యేక చికిత్సా కేంద్రాలు (Cardiology, Neurology, Nephrology, Oncology మొదలైనవి) కలిగిన 1000కిపైగా పడకలతో కూడిన పెద్ద హాస్పిటల్‌గా అభివృద్ధి చెందింది.
కరోనా సమయంలో పాత్ర: కోవిడ్-19 మహమ్మారి సమయంలో MGM ఆస్పత్రి ముఖ్యమైన చికిత్సా కేంద్రంగా పనిచేసింది. అనేక కోవిడ్ బెడ్లు, ICUలు ఏర్పాటు చేసి సేవలు అందించింది.
ప్రస్తుత అభివృద్ధి కార్యక్రమాలు: MGM ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌గా అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వాల నుండి నిధులు కేటాయించబడ్డాయి. కొత్త భవనాలు, మెరుగైన సదుపాయాలు అందించడానికి ప్రణాళికలు కొనసాగుతున్నాయి.