
Enadu Fight against to CM Jagan
Enadu Fight : ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ..రాజకీయాలు మరింత వేడెక్కాయి. మీడియా కూడా తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. ప్రభుత్వ అసమర్థతను, అవినీతిని ఎండగట్టడంలో కథనాల పదును పెంచుతోంది. ముఖ్యంగా ‘ఈనాడు’ ఈ విషయంలో జగన్ సర్కార్ పై పతాక స్థాయి పోరాటానికి సిద్ధమైంది. ఈమధ్య కాలంలో ఎన్నడూ లేనంత తీవ్రస్థాయిలో జగన్ పాలనపై విమర్శనాస్త్రాల్ని సంధిస్తోంది. ప్రతీ రోజూ ఓ అవినీతి ఉదంతాన్ని పతాక శీర్షికల్లో ప్రచురిస్తోంది.
తాజాగా ‘జె గ్యాంగ్ భూమంతర్’ పేరుతో ఓ కథనం ప్రచురించింది. వాన్ పిక్ పేరిట 12,731 ఎకరాల భూమిని కేవలం రూ.167 కోట్లకు నిమ్మగడ్డ ప్రసాద్ హస్తగతం చేసిన వైనాన్ని అందులో ప్రచురించింది. ఈ భూ దోపిడీలో ఎవరెవరు ఉన్నారో వివరాలతో సహ రాసింది. దీనిపై జగన్ ప్రభుత్వం తక్షణం స్పందించాల్సిన అవసరముంది. లేదంటే అవినీతిని ఒప్పుకున్నట్లే అని భావించాలి.
ఇక విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన వేళ.. అసలు అంబేద్కర్ ఆశయాలేంటి? జగన్ ప్రభుత్వం చేస్తున్నదేమిటీ? అంటూ సూటిగా ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఓ కథనం రాసింది. ‘‘దార్శనికుడి దివ్య స్మృతికి దారుణ అవమానమిది’ పేరుతో ఈనాడు ఓ పూర్తి పేజీ కేటాయించడం విశేషం. ఈనాడు లాంటి పత్రిక ఓ విషయం కోసం ఒక పేజీ కేటాయించడమంటే మాములు విషయం కాదు.
‘అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి’ పేరు మీదున్న పథకం నుంచి అంబేద్కర్ పేరు తీసేసిన ప్రభుత్వానికి అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత లేదని ఏకిపారేసింది. అంబేద్కర్ విధానాలకు, జగన్ సర్కార్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెబుతూ రాసిన ఈ కథనం జగన్ సర్కార్ కు ముచ్చెమటలు పట్టించేదే. మొత్తానికి ‘ఈనాడు’ ప్రజల గొంతును వినిపించడంలో అన్ని పత్రికల కంటే ముందు వరుసలో ఉందని చెప్పవచ్చు.