NTR : దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ వార్: ఎన్టీఆర్ వర్సెస్ అమీర్ ఖాన్?
NTR : భారతీయ సినిమాకు పితామహుడిగా కీర్తి ప్రతిష్టలు పొందిన దాదాసాహెబ్ ఫాల్కే గారి జీవిత చరిత్ర ఆధారంగా ఓ బయోపిక్ రాబోతుందనే వార్తలు గత కొన్ని రోజులుగా జోరుగా వినిపిస్తున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక పాత్రలో ఎవరు నటిస్తారు అనే దానిపై ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో, బాలీవుడ్ నుంచి దాదాపు ఒకే సమయంలో రెండు వేర్వేరు అప్డేట్స్ రావడంతో ప్రస్తుతం గందరగోళం నెలకొంది. ఒకరు కాదు, ఇద్దరు అగ్ర తారలు దాదాసాహెబ్ ఫాల్కే పాత్రను పోషించనున్నారని వార్తలు రావడంతో నెటిజన్లు, సినీ ప్రియులు ఎవరు నిజంగా ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారో తెలియక డైలమాలో పడిపోయారు.
ముందుగా టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్‌లో నటించనున్నారని కథనాలు వెలువడ్డాయి. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి పర్యవేక్షణలో ఈ సినిమా ఉంటుందని, రెండేళ్ల క్రితం రాజమౌళి ప్రకటించిన ‘మేడ్ ఇన్ ఇండియా’ ప్రాజెక్ట్ ఇదేనని వార్తలు ఊపందుకున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ, వరుణ్ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తారని, నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తారని గతంలో రాజమౌళి వెల్లడించారు. అయితే, అప్పట్లో హీరో పేరు చెప్పలేదు. తాజాగా, ఈ ప్రాజెక్ట్‌కు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఆయనే దాదాసాహెబ్ ఫాల్కే పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరిగింది.
వెంటనే అమీర్ ఖాన్ ఎంట్రీ… హిరానీ దర్శకత్వంలో?
ఎన్టీఆర్ బయోపిక్ వార్తలు బయటకు వచ్చిన గంటల వ్యవధిలోనే, బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్ ఖాన్ కూడా దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ చేస్తున్నారని మరో ప్రకటన వచ్చింది. దీనికి ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్నారని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. హిరానీ గత నాలుగేళ్లుగా ఈ బయోపిక్ స్క్రిప్ట్ పనులపై పనిచేస్తున్నారని కూడా వారు పేర్కొన్నారు.
బయోపిక్ వార్: ఎన్టీఆర్ వర్సెస్ అమీర్ ఖాన్!
ఈ రెండు వార్తలు దాదాపు ఒకే సమయంలో బయటకు రావడంతో, దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ ఇప్పుడు “ఎన్టీఆర్ వర్సెస్ అమీర్ ఖాన్” వార్‌గా మారిపోయింది. ఇద్దరు భారతీయ సినిమా దిగ్గజాల జీవితాన్ని, ఇద్దరు అగ్ర నటులు, ఇద్దరు ప్రముఖ దర్శకుల పర్యవేక్షణలో/దర్శకత్వంలో వేర్వేరుగా తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని భావిస్తున్నారు.