
Jagan’s indirect criticism on Sharmila
Jagan Criticism : ఏపీలో ఎన్నికల కోలాహలం మాములుగా లేదు. మరో రెండు, మూడు నెలల్లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఉండడంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. వైసీపీ ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటిస్తుండగా.. టీడీపీ, జనసేన కూటమి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి తన పూర్తి అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి.
ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. మొన్న కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినా షర్మిల..అదే రోజు అన్న జగన్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించింది. దీనిపై ఇప్పటి వరకు జగన్ మౌనంగా ఉంటూ వచ్చారు. ఇవాళ మాత్రం ఉరవకొండలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా నిధుల విడుదల కార్యక్రమంలో షర్మిలకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.
అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి హాజరైన సీఎం జగన్.. విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో పాటు పరోక్షంగా వైఎస్ షర్మిలపైనా విమర్శలు గుప్పించారు. పక్క రాష్ట్రాల నుంచి చంద్రబాబు కోసం స్టార్ క్యాంపెయినర్లు వస్తున్నారంటూ ఈ ముగ్గురిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రంలో ఉంటున్న దత్తపుత్రుడు చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్ అంటూ పవన్ ను టార్గెట్ చేశారు.
జెండాలు జతకట్టడమే వారి అజెండా అని, ప్రజల గుండెల్లో గుడి కట్టడమే జగన్ అజెండా అని సీఎం జగన్ తెలిపారు. మీరే నాకు స్టార్ క్యాంపెయినర్లంటూ ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మీ బిడ్డ మిమ్మలనే నమ్ముకున్నాడని, మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లుగా మీరే రావాలన్నారు. సైనికులుగా మీరే రావాలని కోరారు. మీరు వేసే ఓటు ఒక్క జగన్ ను సీఎం చేయడానికే కాదని, ప్రతీ పేదవాడు బాగుపడాలంటే జగన్ సీఎం కుర్చీలో కూర్చుంటేనే అది సాధ్యమవుతుందని తెలిపారు.
కాగా, షర్మిల విమర్శల ధాటిని ఎదుర్కొనేందుకు జగన్ కూడా ప్రతీ దాడి చేసే అవకాశాలే కనపడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మున్ముందు అన్నా, చెల్లిల మధ్య మాటల యుద్ధం మరింత పెరుగనుందంటున్నారు. అయితే చెల్లితో పోరు ఎలా చూసినా జగన్ పై ఎంతో కొంత ప్రభావం పడే అవకాశాలే ఎక్కువ అని అంటున్నారు. ఏదేమైనా ఈ ఎన్నికలు మాత్రం రసవత్తరంగా సాగుతాయనడంలో డౌటే అక్కర్లేదు.