K.J. Yesudas Birth Day : కె.జె. ఏసుదాస్.. ఓ స్వరరాగ గంగా ప్రవాహం..

K.J. Yesudas : మన దేశంలోని ప్రముఖ ప్రజా గాయకుల్లో ఒకరు కె.జె. ఏసుదాస్. ఒక ప్రాంతం, ఒక భాష, ఒక వర్గం వంటి ఎల్లలు దాటి ఒక ఉన్నతమైన గాయకుడిగా వ్యాపించిన, రాణించిన ప్రజా గాయకుడు ఏసుదాస్.

శ్రుతి, తాళం లేకుండా వికృత గాత్రంతో అపభ్రంశంగా అరిచేవాళ్లూ, ఆర్తనాదాలు చేసేవాళ్లూ గాయకులు, ప్రజా గాయకులు అవరు. శ్రుతి సౌఖ్యం, గాత్ర సౌష్టవం, అభిజ్ఞతలతో మన దేశంలోని ఒక గొప్ప గాయకుడు ఏసుదాస్.

సినిమా సంగీతం, శాస్త్రీయ సంగీతం రెండూ రెండు‌ ఱెక్కలు ఆయనకు. ఆ రెండు ఱెక్కలతోనూ ఆయన గాన గగనంలో సదా విహరిస్తూంటారు.

A rounded even warm baritone ఆయనది. A special timbre తో ఆయన నాదం ఉన్నతమైంది. గానంగా ఆయన తన నాదాన్ని సంపూర్ణంగా అందించారు. నాదావిష్కరణనే గానా విష్కరణగా చేశారు ఏసుదాస్.

ఏసుదాస్ వచ్చేనాటికి దక్షిణాది సినిమాలో తెలుగులో ఘంటసాల, తమిళ్ష్‌లో టి.ఎమ్. సౌందరరాజన్ ప్రముఖమైన గాయకులుగా చలామణిలో ఉన్నారు. కానీ ఏసుదాస్ ఆ ఇద్దరినీ కాకుండా పి.బి. శ్రీనివాస్, రఫీ గాత్ర, గానాలను ఆకళింపు చేసుకున్నారు. ఇది ఏసుదాస్ గొప్పతనం. సినిమా గానంపై సరైన అవగాహనతో ఒక గొప్ప గాయకుడుగా చారిత్రాత్మకమయ్యారు ఆయన.

ఒక సినిమా గాయకుడుగానూ, మఱోవైపు శాస్త్రీయ సంగీత గాయకుడుగానూ రాణించిన తొలి గాయకుడు మన దేశంలో ఏసుదాస్ మాత్రమే. ఒక కర్ణాటక సంగీత గాయకుడుగా ఏసుదాస్ ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. పెద్ద వయసు వచ్చాక కూడా ఆయన కర్ణాటక సంగీతంలో
విశేషమైన పరిశ్రమ చేసేవారు. ఎప్పటికప్పుడు
కర్ణాటక సంగీతం పరంగా అభ్యాసంతో తనను తాను మెఱుగు పెట్టుకునేవారు. కర్ణాటక సంగీతంలో ఆయన ఒక విద్వత్ గాయకుడు.

చెంబై వైద్దియనాద అయ్యర్ శిష్యరికంలో ఏసుదాస్ కర్ణాటక సంగీత గాయకుడుగా పరిణమించారు. సంగీతమో, మఱో కళో కుల, మత, వర్గ బద్ధం అవదు. ఇందుకు ఏసుదాస్ నిలువెత్తు నిదర్శనం. బ్రాహ్మణత్వమో, దళితత్వమో జన్మతః ఉండదు; అవి మనిషి తనంత తాను ఎన్నుకునేవి. ఏసుదాస్ బ్రాహ్మణత్వాన్ని ఎన్నుకున్నారు; మేలుగా బతకడాన్ని ఎన్నుకున్నారు. బ్రాహ్మణులు అనబడుతున్న వాళ్ల మాట వేష భాషల్ని, తీరు, తెన్నుల్ని ఏసుదాస్ అందిపుచ్చుకున్నారు.

కులం, మతం ప్రాతిపదికలుగా అధమంగా ఆయన బతకలేదు. కళ, ప్రతిభ, పరిశ్రమ ప్రాతిపదికలుగా ఆయన ఉన్నతంగా బతికారు.

మలయాళ సంస్కృతిలో ఆయన ఒక భాగం. కేరళలో వ్యాపార స్థలాల్లోనూ, కొట్లపైనా ఆయన ఫోటోలు పెట్టుకుంటారు.

2013లో చెన్నైలో World poetry society Intercontinental and Soka Gakkai International -Japan సంయుక్తంగా నిర్వహించిన ఒక కవి సమ్మేళనంకు ఆయన తనంత తానుగానే వచ్చారు. మాకు ఆశ్చర్యం కలిగింది.‌ దుబాయ్ కవి ఘనేమ్ ఆ కార్యక్రమానికి అతిథి. కవులపై ఉన్న అభిమానంతో ఘనేమ్ కోసం ఏసుదాస్ ఆహ్వానితుడు కాకపోయినా వచ్చారు.

World poetry societyకి కార్యదర్శిగా
ఆ కార్యక్రమం పనులు చూసుకుంటున్న నేను ఆ సందర్భంలో ఆయనతో దగ్గరగా మెలగడం మరిచిపోలేనిది. ఆయన భుజంపై చెయ్యి‌వేసి ఆయన పక్కన నుంచోవడం ఇప్పటికీ నాకు ఆనందాన్నిస్తూంటుంది.

తన అద్భుతమైన గాత్రంతో ఎన్నో గొప్పపాటలు పాడారు. హిస్‌ హై నెస్ అబ్దుల్లా అన్న మలయాళం సినిమాలో “ప్రమదవనం వేండుమ్…” అంటూ త్రిస్థాయిల్లో పాడిన పాట అనితరసాధ్యం. అబూర్వ రాగంగళ్ అన్న తమిళ్ సినిమాలో “అదిసయ రాగం ఆనంద రాగం అబూర్వరాగం…” అంటూ ఆయన పాడిన ఒక అపూర్వమైన పాట ఆయన పాడినందువల్లే గొప్ప పాటయింది.

హిందీ, తెలుగు, కన్నడం భాషల్లో ప్రజాదరణ పొందిన గొప్ప పాటలు పాడారు ఏసుదాస్.

తెలుగు సినిమా మేఘసందేశంలో ఏసుదాస్ గానం అజరామరం.

ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం సతీ సమేతంగా ఒక బహిరంగ వేదికపై ఏసుదాస్ గారికి పాద పూజ చేశారు. ఇది ఏసుదాస్ అంటే ఏమిటో తెలియజేస్తుంది.

-రోచిష్మాన్
9444012279

TAGS