కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారి నియామక వేడుకకు హాజరైన టీటీడీ చైర్మన్, రాష్ట్ర మంత్రి
కంచి: తమిళనాడులోని ప్రసిద్ధ కంచి పుణ్యక్షేత్రంలో బుధవారం కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారి నియామక వేడుక వైభవంగా జరిగింది. ఈ మహోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) చైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు, రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ హాజరయ్యారు.
అన్నవరానికి చెందిన ప్రముఖ వేద పండితులు శ్రీ దుడ్డు సుబ్రహ్మణ్య గణేష శర్మకు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారు సన్యాస దీక్షను అనుగ్రహించి శిష్య స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఉత్తరాధికారిగా నియమితులైన శ్రీ గణేష్ శర్మకు శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిగా నామకరణం చేశారు.
ఈ వేడుకలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు, రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్‌తో పాటు బిజెపి రాష్ట్ర మీడియా ఇంచార్జ్ మరియు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పాతూరి నాగభూషణం, రామినేని ధర్మ ప్రచారక్ మరియు బ్రాండిక్స్ అదినేత దొరైస్వామి కూడా పాల్గొన్నట్లు సమాచారం.
కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారి నియామకం ఆధ్యాత్మిక లోకంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరై, నూతన ఉత్తరాధికారికి ఆశీస్సులు అందజేశారు.