
Karthika Deepam Serial
Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ ను ఆ దర్శకుడు, నిర్మాతలు ఓ పట్టాన వదిలేరా లేరు. తెలుగు మహిళలను అలరించడానికి, నిత్యం ఈ సీరియల్ గురించి ముచ్చటించుకోవడానికి ఎన్ని విన్యాసాలు పడ్డారో ఎవరు మరిచిపోతారు. ఇది ఓ రకంగా ఆడియన్స్ మీద రివేంజ్ అన్నమాట. ఈ సీరియల్ చివరలో నానా బీభత్సం చేసి, కథను నానా మలుపులూ తిప్పి, ప్రధాన పాత్రధారులను చంపేసి, కొత్త జనరేషన్ కథ కొనసాగింపు పేరిట కార్తీక దీపం సీరియల్ ప్రేమికుల్ని నానా హింస పెట్టాడు ఆ డైరెక్టరు..
చివరాఖరికి తమకే చిరాకెత్తి..ఆడియన్స్ తిరస్కారం ఎక్కువైపోయి, రేటింగ్ ల్లో దిగజారిపోయి, ఇక చూడలేర్రా బాబోయ్ అన్నంత స్థితికి వచ్చిన వేళా.. అర్థంతరంగానే కథకు ముగింపు చెప్పేశారు. ఒక సీరియల్ ఎలా ఉండి, ఎలా పాపులర్ కావాలో చాటిన ఆ సీరియల్ చివరకు ఒక సీరియల్ ఎలా మారకూడదో చెప్పడానికి ఉదాహరణగా కూడా మారింది.
రేటింగ్ తక్కువ కావడానికి తన దర్శకత్వ ప్రతిభను కాకుండా ఆడియన్సే చూడడం లేదని ఆలోచనతో సదరు డైరెక్టర్ మళ్లీ అదే కథను కొత్తగా చెప్పడానికి సీక్వెల్ కు ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉంటే స్టార్ మాటీవీ వాళ్లకు ఈ సీరియల్ తర్వాత పెద్దగా హిట్టయిన సీరియల్ కూడా లేదు. అందుకే మళ్లీ ‘కార్తీక దీపం’ చెంతన చేరారు. కొత్త విన్యాసానికి పేరు ‘‘కార్తీక దీపం’’. ఇది నవ వసంతం..అనేది ట్యాగ్ లైన్.
అసలు ఆడియన్స్ రివేంజ్ తీసుకునే ఆలోచన ఎలా వచ్చిందో ఆ డైరెక్టర్ కు. ప్రస్తుతం మహిళా ప్రేక్షకులు అంతా సీరియళ్లను వదిలేసి వెబ్ కంటెంట్ వైపు దూసుకెళ్తున్నారు. యూట్యూబ్ షార్ట్స్, వీడియాలతో చాలా బిజీబిజీగా ఉన్నారు. అక్కడే ఫుల్ ఎంటర్ టైన్ అవుతున్నారు. ఇక ఈ సమయంలో కార్తీక దీపం అంటూ నానా విన్యాసాలు, వికారాలు చూసే ఓపిక వాళ్లకు లేదు. ఇక వాళ్లు వదిలిన ప్రోమో చూస్తే అదే సౌర్య.. కాకపోతే పాత్రధారి వేరు.. మా అమ్మే నాకు అన్నీ అంటోంది, నాన్న తెలియదు అంటోంది..సో పాత కథ మధ్య నుంచి కొత్త కథను ఆరంభిస్తారేమో..కావొచ్చు.