PM Modi : ఉగ్రవాదాన్ని అంతం చేయకుంటే పాక్ అంతం: ప్రధాని మోదీ తీవ్ర హెచ్చరిక

Modi

Modi

PM Modi : న్యూఢిల్లీ: పాకిస్థాన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతం చేయకుంటే ఆ దేశం మనుగడకే ప్రమాదమని ఆయన స్పష్టం చేశారు. భారత్ పాకిస్థాన్‌తో కేవలం రెండు అంశాలపై మాత్రమే చర్చిస్తుందని, అవి ప్రభుత్వ ప్రోద్బలంతో నడుస్తున్న ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) అని తేల్చి చెప్పారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ, పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పూర్తిగా ఆపివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆ దేశం అంతరించిపోతుందని తీవ్రంగా హెచ్చరించారు. ‘టెర్రర్ ట్రేడ్’, నీళ్లు-రక్తం ఒకే మార్గంలో ప్రవహించవని ఖరాకండిగా చెప్పారు.

ఆపరేషన్ సిందూర్ కొనసాగింపు – సైనిక దళాల ఆధారాలు

మరోవైపు, భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ను కొనసాగిస్తూనే ఉందని, దాయాది దేశంపై ప్రతిదాడులు నిర్వహిస్తోందని వెల్లడైంది. ఉగ్రవాద దేశం చేస్తున్న దాడులను భారత బలగాలు ఎప్పటికప్పుడు సమర్థవంతంగా ప్రతిఘటిస్తున్నాయి. తాజాగా, సోమవారం త్రివిధ దళాల అధిపతులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాకిస్థాన్ పై తాము నిర్వహించిన దాడులు, వాటివల్ల కలిగిన నష్టాన్ని, ఎక్కడెక్కడ దాడులు చేశారన్న వివరాలను లెక్కలతో సహా వివరించారు. ఉపగ్రహ చిత్రాలు, ఇతర ఖచ్చితమైన ఆధారాలను కూడా వారు వెల్లడించారు. దీనికి భిన్నంగా, పాకిస్థాన్ మాత్రం భారతదేశానికి చెందిన డ్రోన్లను, యుద్ధ విమానాలను కూల్చివేశామని గొప్పలు చెప్పుకున్నా, వాటికి ఆధారాలు చూపడంలో విఫలమైంది. దీంతో పాక్ త్రివిధ దళాలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మోదీ కీలక వ్యాఖ్యలు – పాక్ ఆందోళన

త్రివిధ దళాల అధిపతుల సమావేశం తర్వాత సోమవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత దళాల దాడితో ఉగ్రవాద దేశానికి మూడు రోజుల్లోనే ముచ్చెమటలు పట్టాయని, వెంటనే ఆందోళన చెంది మన డీజీఎంతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నించిందని ఆయన పేర్కొన్నారు.ఈ సమయంలో మన ప్రజలపై, విద్యా సంస్థలపై, ఆర్మీ శిబిరాలపై దాడులు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ, మన అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అప్రమత్తమై పాకిస్థాన్ దుర్మార్గాన్ని గాల్లోనే తుత్తునీయలు చేసిందని అన్నారు. మన ఆర్మీ ‘కౌంటర్ టీ’తో ఉగ్రవాద దేశం అతలాకుతలం అయిపోయిందని ఆయన తెలిపారు.

రెండు అంశాలపైనే చర్చ – PoKపై స్పష్టత కావాలి

ఉగ్రవాద దేశంతో ప్రధానంగా చర్చించేది రెండే విషయాలని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఒకటి – ఆ దేశం ఉగ్రవాదాన్ని పూర్తిగా విడనాడాలి, తొక్కిపెట్టాలి. లేకపోతే పాకిస్థాన్ అనేది కాలగర్భంలోకి వెళ్లిపోతుంది. రెండు – పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)పై తన నిర్ణయం ఏమిటో దాయాది చెప్పాలి. లేకపోతే తదుపరి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. మా వరకు వేరే విషయాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని, PoK, ఉగ్రవాదం మినహా వేరే వాటి గురించి చర్చించాల్సిన అగత్యం ఈ దేశానికి పట్టలేదని ఆయన అన్నారు.

భారత్ బలంగా, గర్వంగా ఉంది

భారత్ చాలా బలమైందని, అన్నిటికంటే గర్వమైనదని, ఇంకే దేశం పెత్తనం మన దగ్గర సాగదని, ఏ దేశం మాట వినాల్సిన అవసరం ఈ దేశానికి లేదని మోదీ నొక్కి చెప్పారు. ఈ దేశం సార్వభౌమ అధికారం, సమగ్ర పరిపాలన మిగతా దేశాలకు ఆదర్శమని ఆయన వ్యాఖ్యానించారు.

మొత్తంగా, ఒత్తిడి ఎదుర్కొంటున్నారన్న విమర్శల మధ్య నరేంద్ర మోదీ ఒక్కసారిగా తన భవిష్యత్ కార్యాచరణను వెల్లడించారు. అంతేకాదు, ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా లోతుగా వెళుతుందని ఆయన చెప్పకనే చెప్పారు.

TAGS