
Sunita Reddy’s revenge on her father’s murder
YS Sunitha Reddy : తన తండ్రిని హత్య చేసిన నిందితులకు శిక్ష పడేంత వరకూ తన పోరాటం కొనసాగించేందుకు సిద్ధమైన వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి వారిని రాజకీయంగా దెబ్బకొట్టేలా అడుగులు వేస్తున్నారు. వివేకా హత్య కేసులో పోరాటానికి మద్దతుగా నిలిచిన షర్మిలతో కలిసి నడిచేందుకు సునీతా రెడ్డి కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది. తన తండ్రి హత్యపై సునీత తొలి నుంచి గట్టి పోరాటం చేస్తున్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి సీబీఐ విచారణ కోరడం.. ఆ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి రావడం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పలువురు అరెస్ట్ అయ్యారు. కడప ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి నిందితులుగా ఉన్నారు.
షర్మిలకు తోడుగా రాజకీయ పయనం చేయాలని తన తండ్రిని చంపేసిన హంతకులకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేయాలని సునీత పట్టుదలగా ఉన్నారు. ఈ మేరకు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలున్నాయని అంటున్నారు. సునీత లేదా ఆమె తల్లి కడప లోక్ సభ స్థానానికి పోటీ చేసే అవకాశం ఉంది. ఈ స్థానం నుంచి మరోసారి అవినాశ్ రెడ్డికే జగన్ రెడ్డి టికెట్ ఖరారు చేస్తారని చెబుతున్నారు. అందుకే ఆయనపై పోటీకి సునీతా రెడ్డి రెడీ అవుతున్నారని తెలుస్తోంది.
ఈక్రమంలో వైఎస్ షర్మిలతో సునీతా రెడ్డి ఇవాళ ఉదయం ఇడుపులపాయలో భేటీ అయ్యారు. దాదాపు 2గంటల పాటు ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఆమె కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. షర్మిల పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత సునీతా రెడ్డి కలువడం ఇదే మొదటిసారి.
ఈ సమావేశంలో సునీత రాజకీయ ప్రవేశంపై చర్చ జరిగినట్లు సమాచారం. సునీతా రెడ్డి రాజకీయాల్లోకి వచ్చి కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తే వైసీపీకి పెద్ద దెబ్బే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సునీతారెడ్డిపై ప్రజల్లో సానుభూతి ఉండడం, వివేకాకు ప్రజలకు ఉన్న మంచి పేరు సునీతా లాభిస్తుందని అంటున్నారు. ఇక ఆమె పొలిటికల్ ఎంట్రీపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి.