Congress : కాంగ్రెస్ పై వరుస పోరాటాలకు రంగం సిద్ధం
Congress vs BRS : తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ, కాంగ్రెస్ ద్రోహాన్ని ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో నిర్వహించిన కీలక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలన “వాగు దాటే దాక ఓడ మల్లన్న.. వాగు దాటినంక బోడి మల్లన్న” అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. వరంగల్ సభ కాంగ్రెస్ ప్రభుత్వ అంతానికి ఆరంభమని పేర్కొన్నారు. కాంగ్రెస్ అరాచకాలను ఎదుర్కోనే శక్తి కేవలం బీఆర్ఎస్\u200cకు మాత్రమే ఉందని ధీమా వ్యక్తం చేశారు.
రైతుల ఆత్మహత్యలు, వారి సమస్యల పరిష్కారంపై రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ విస్తృత పోరాటాలు చేస్తుందని కేటీఆర్ ప్రకటించారు. మోసానికి మారుపేరైన కాంగ్రెస్ నైజాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని, ప్రజలకు ఇచ్చిన హామీల అమలును ఎలా విస్మరించిందో వివరిస్తామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నిరంతర పోరాటాలకు సిద్ధం కావాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.